ఉప్పల్‌లో సన్‌రైజర్స్ పరుగుల సునామీ.. ఛేజింగ్ లో ఆర్సీబీ నిలిచేనా?

  • హైదరాబాద్‌లో ఆర్సీబీపై చెలరేగిన సన్‌రైజర్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు
  • ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలు
  • బెంగళూరు ముందు 256 పరుగుల కఠిన లక్ష్యం
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. దీంతో ఆర్సీబీ ముందు 256 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), హెన్రిచ్ క్లాసెన్ (51) అద్భుత అర్ధ సెంచరీలతో కదం తొక్కారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లపై దాడికి దిగాడు. ట్రావిస్ హెడ్ (26) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఒకవైపు నిలకడగా ఆడుతూనే భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి క్లాసెన్ తోడవడంతో పరుగుల వరద పారింది. క్లాసెన్ కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.

ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ స్కోరు 250 మార్కును దాటింది.

ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ రెండు వికెట్లు తీసినప్పటికీ 52 పరుగులు సమర్పించుకున్నాడు. సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. స్టార్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయారు. 

Sunrisers Hyderabad
SRH vs RCB
IPL 2024
Indian Premier League
Abhishek Sharma
Heinrich Klaasen
Ishan Kishan
Rajiv Gandhi International Stadium
Royal Challengers Bangalore
T20 Cricket

More Telugu News